Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 40

Story of Sagara-3 ( contd )!

బాలకాండ
నలుబదియవ సర్గము
( సగరుని యజ్ఞాశ్వము వెదుకుటలో సగరుని పుత్రులు భస్మమగుట)

దేవతానాం వచః శ్రుత్వా భగవాన్ వై పితామహః |
ప్రత్యువాచ సుసంత్రస్తాన్ కృతాంత బలమోహితాన్ ||

స|| సుసంత్రస్తాన్ కృతాంత బలమోహితాన్ దేవతానాం వచః శ్రుత్వా భగవాన్ వై పితామహః ప్రత్యువాచ |

తా|| అత్యంత కలవరపడుతూ భయభ్రాంతులైన దేవతల వచనములను విని సృష్ఠికర్త అయిన బ్రహ్మ ఇట్లు పలికెను.

య స్యేయం వసుధా కృత్స్నా వాసుదేవస్య ధీమతః |
కాపిలం రూప మాస్థాయ ధారయత్యనిశం ధరామ్ ||
తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాః |||

స|| యస్య ఇయం వసుధా కృత్స్నా (స) వసుదేవస్య ధీమతః కాపిలం రూపం ఆస్థాయ అనిశామ్ ధరాం ధారయతి | స నృపాత్మజాః తస్య కోపాగ్నినా ధగ్దా భవిష్యంతి |

తా|| "ఈ భూమండలమంతా ఎవరిదో , ఆ వాసుదేవుడు కపిల మహర్షి రూపము ధరించి అనుక్షణము ఈ భూమిని మోయుచున్నాడు. ఆ రాజకుమారులు అందరూ ఆయన కోపాగ్నిలో మరణించెదరు".

పృథివ్యాశ్చాపి నిర్భేధో దృష్ట ఏవ సనాతనః |
సగరస్య చ పుత్రాణాం వినాశోsదీర్ఘజీవినామ్ ||

స||పృథివ్యాశ్చ నిర్భేదః అపి , అదీర్ఘజీవినాం సగరస్య పుత్రాణాం వినాశః అపి సనాతనః దృష్ట ఏవ |

తా|| "ఈ పృథివి త్రవ్వబడడము , అల్పాయుస్సుగల సగరపుత్రుల నాశనము కూడా పూర్వకాలములో నిర్ణయింపబడినది".

పితామహ వచః శ్రుత్వా త్రయస్త్రింశ దరిందమ |
దేవాః పరమ సంహృష్టాః పునర్జగ్ముర్యథాగతమ్ ||

స|| త్రయస్త్రింశద్ అరిందమః దేవాః పితామహస్య వచః శ్రుత్వా యథాగతం (తథా) పునర్జగ్ముః |

తా|| సృష్ఠికర్తయొక్క ఆ మాటలను విని ముప్పదిమూడు దేవతలు మళ్ళీ వచ్చిన విధానముగనే వెళ్ళిపోయిరి.

సగరస్య చ పుత్రాణాం ప్రాదురాసీన్ మహత్మనామ్ |
పృథివ్యాం భిద్యమానాయాం నిర్ఘాత సమనిస్వనః||

స|| పృథివ్యాం భిద్యమానాయాం మహాత్మనాం , సగరస్య చ పుత్రాణాం నిర్ఘాత సమనిస్వనః ప్రాదురాసీత్ |

తా|| ఆ పృథివిని త్రవ్వుచున్న ఆ మహాబలవంతులగు సగరపుత్రులు నిర్ఘాత పరచునట్టి ధ్వనిని ఎదుర్కొనిరి.

తతో భిత్త్వా మహీం సర్వే కృత్వాచాపి ప్రదక్షిణమ్ |
సహితా సాగరా స్సర్వే పితరం వాక్యమబ్రువన్ ||

స|| తతః మహీం భిత్త్వా సర్వే చాపి ప్రదక్షిణం కృత్వా సర్వే సాగరా సహితా పితరం వాక్యమబ్రువన్ |

తా|| అప్పుడు భూమండలమంతయూ త్రవ్వి ప్రదక్షణముచేసి ఆ సగర పుత్రులందరూ తండ్రితో ఇట్లుచెప్పిరి.

పరిక్రాంతా మహీ సర్వా సత్త్వవంతశ్చ సూదితాః |
దేవదానవ రక్షాంసి పిశాచోరగ కిన్నరాః ||
న చ పశ్యామహే అశ్వం తం అశ్వహర్తారం ఏవ చ |
కిం కరిష్యామ భద్రం తే బుద్ధిరత్ర విచార్యతామ్ ||

స|| మహీ సర్వా పరిక్రాంతా , దేవదానవ , రక్షాంసి , పిశాచోరగ కిన్నరాః సత్త్వవంతశ్చ సర్వా సూదితాః| ( వయం) అశ్వం న పశ్యామహే , తం అశ్వహర్తారం ఏవ చ ( న పశ్యామహే) . కిం కరిష్యామ . అత్ర బుద్ధిః విచార్యతామ్. తే భద్రమ్ ( అస్తు).

తా || "ఈ భూమండలమంతయూ గాలించితిమి. దేవ దానవ రాక్షస , పిశాచ , నాగ , కిన్నర తదితర ప్రాణులను నాశనము చేసితిమి. మేము ఆ యజ్ఞాశ్వమును చూడలేదు. అశ్వమును అపహరించినవానిని కూడా చూడలేదు. మేము ఏమి చేయవలెనో మీరు విచారింపవలసినది.మీకు శుభమగుగాక".

తేషాం తద్వచనం శ్రుత్వా పుత్త్రాణాం రాజసత్తమః |
సమన్యురబ్రవీద్వాక్యం సగరో రఘునందన ||

స|| '(హే) రఘునందన ! తత్ వచనం శ్రుత్వా రాజసత్తమః సమన్యుః సగరో పుత్రాణాం వాక్యం అబ్రవీత' |

తా|| 'ఓ రఘునందనా ! వారి మాటలను వినిన ఆ రాజసత్తముడు అగు సగరుడు అదే ఆలోచనగలవాడై పుత్రులతో ఇట్లు పలికెను,

భూయః ఖనత భద్రం వో నిర్భిధ్య వసుధాతలమ్ |
అశ్వహర్తార మాసాద్య కృతార్థాశ్చ వివర్తథ ||

స|| భూయః ఖనత | భద్రం వో | వసుధాతలమ్ నిర్భిధ్య అశ్వ హర్తారం ఆసాద్య చ కృతార్థాః వివర్తథ |

తా||" మళ్ళీ త్రవ్వుడు.. మీకు శుభమగుగాక. వసుధాతలమంతయూ త్రవ్వి అశ్వమును అపహరించినవానిని పట్టుకొని కృతార్థులై తిరిగిరండు".

పితుర్వచనమాసాద్య సగరస్య మహాత్మనః |
షష్టిః పుత్త్రసహస్రాణి రసాతల మభిద్రవన్ ||

స|| మహాత్మనః సగరస్య షష్టి సహస్రాణి పుత్త్రః పితుః వచనం ఆసాద్య రసాతలం అభిద్రవన్ |

తా|| మహాబలవంతులగు సగరునియొక్క అరువది వేల పుత్రులు ఆ తండ్రి మాటవిని రసాతలము వరకూ త్రవ్వుచూ పోయిరి.

ఖన్యమానే తతస్మిన్ దదృశుః పర్వతోపమమ్ |
దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలమ్ ||

స|| తతః ఖన్యమానే ( తే) పరవతోపమం , మహీతలం ధారయంతం , దిశాగజం , విరూపాక్షం తస్మిన్ దదృశుః |

తా|| అలాగ త్రవ్వుచున్న సగరపుత్రులు భూమినంతయును మొయుచున్న ఒక విరూపాక్ష మనబడు మహగజమున్ను చూచిరి.

సపర్వతవనాం కృత్స్నాం పృథివీం రఘునందన |
శిరసా ధారయామాస విరూపాక్షో మహాగజః ||

స|| (హే) రఘునందన ! విరూపాక్షో మహాగజః సపర్వత వనాం కృత్సానాం పృథివీం శిరసా ధారయామాస |

తా|| ఓ రఘునందనా! ఆ విరూపాక్షము అనబడు ఆ మహాగజము , పర్వతములతో వనములతో కూడియున్న ఆ పృథివిని శిరస్సుపై ధరించియుండెను.

యథా పర్వణి కాకుత్ స్థ విశ్రమార్థం మహాగజః |
ఖేదాచ్ఛాలయతే శీర్షం భూమికంపస్తదా భవేత్ ||

స|| (హే) కాకుత్స్థా ! యథా (స) మహాగజః పర్వణి విశ్రమార్థం శీర్షం ఖేదాచ్చాలయతే తదా భూమికంపః భవేత్ |

తా|| ఓ రామా ! ఆ మహాగజము ఒక పర్వదినమున విశ్రామము కోసము తన తలను కదిలించినపుడు భూమి కంపించును కూడా .

తం తే ప్రదక్షిణం కృత్వా దిశాపాలం మహాగజమ్ |
మానయం తో హి తే రామ జగ్ముర్భిత్యారసాతలమ్ ||
తతః పూర్వాం దిశం భిత్వా దక్షిణం భిభిదుః పునః |
దక్షిణస్యామపి దిశి దదృశుస్తే మహాగజమ్ ||

స|| (హే) రామ ! తే తం మహాగజం ప్రదక్షిణీ కృత్వా రసాతలం ఆనయంతో హి దిశాపాలం జగ్ముః | తతః పూర్వాం దిశం భిత్వా , దక్షిణం పునః బిభిదుః | దిశి దక్షిణస్యాం అపి తే మహాగజం దదృశుః |

తా|| ఓ రామా! వారు ఆ మహా గజమునకు ప్రదక్షిణము చేసి రసాతలము వఱకు త్రవ్వుచూ పోయిరి. పూర్వ దిశను త్రవ్విన పిమ్మట వారు దక్షిణదిశలో త్రవ్విరి. దక్షిన దిశలో కూడా ఆ మహాగజమును చూచిరి.

మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమమ్ |
శిరసా ధారయంతం తే విస్మయం జగ్మురుత్తమమ్ ||

స||శిరసా ధారయంతం సుమహత్ పర్వతోపమమ్ మహాత్మానం మహాపద్మం ( దృష్ట్వా) తే ఉత్తమం విస్మయం జగ్ముః |

తా|| శిరస్సుపై ధరించబడి పర్వత సమానమగు మహాశరీరముగల మహాపద్మము (అనబడు మహాగజము) ను చూచి వారందరూ అశ్చర్యపడిరి.

తతః ప్రదక్షిణం కృత్వా సగరస్య మహాత్మనః |
షష్టిః పుత్త్రసహస్రాణి పశ్చిమాం భిభిదుర్దిశమ్ ||

స|| తతః షష్టిః పుత్త్రసహస్రాణి సగరస్య మహాత్మనః (తం) ప్రదక్షిణం కృత్వా పశ్చిమాం దిశం భిభిదుః |

తా|| అప్పుడు ఆ అరువదివేల సగరపుత్రులు ఆ గజముకు ప్రదక్షినముచేసి పశ్చిమ దిశలో త్రవ్వసాగిరి.

పశ్చిమాయామపి దిశి మహాంత మచలోపమమ్ |
దిశాగజం సౌమనసం దదృశుస్తే మహాబలాః ||

స|| తే మహబలాః దిశి పశ్చిమాయాం అపి మహంతం అచలోపమమ్ సౌమనసం దిశాగజం దదృశుః |

తా|| ఆ మహాబలురు ఆ పశ్చిమదిశలో కూడా పెద్ద పర్వతసమానమైన సౌమనసమనబడు మహాగజమును చూచిరి.

తం తే ప్రదక్షిణం కృత్వా పృష్ట్వా చాపి నిరామయమ్ |
ఖనంత స్సముపక్రాంతా దిశం హైమవతీం తతః ||

స|| తే తమ్ ప్రదక్షిణం కృత్వా నిరామయం పృష్ఠ్వా అపి తతః హైమవతీం దిశం ఖనంతః సముపక్రాంతా |

తా|| వారు దానికి ప్రదక్షిణము చేసి కుశలము అడిగి మరల ఉత్తరదిశలో త్రవ్వుటకు ఉపక్రమించిరి.

ఉత్తరశ్యాం రఘుశ్రేష్ఠ దదృశుర్హిమపాండరమ్ |
భద్రం భద్రేణ వపుషా ధారయంతం మహీమిమామ్ ||

స|| (హే ) రఘు శ్రేష్ఠ ! ఉత్తరస్యాం ( దిశి) ఇమామ్ మహీం వపుషాం భద్రం భద్రేణ ధారయంతం హిమ పాణ్డురం దదృశుః |

తా|| ఓ రఘు శ్రేష్ఠా! ఉత్తరదిశలో కూడా మంచువలె తెల్లగానున్న భద్రమనబడు గజము భద్రముగా భుభారమును మోయుచుండుటను చూచిరి.

సమాలభ్య తతః సర్వే కృత్వా చైనం ప్రదక్షిణమ్ |
షష్టిః పుత్త్ర సహస్రాణి భిభిదు ర్వసుధాతలమ్ |

స|| ఏనం సర్వే సమాలభ్య ప్రదక్షిణం చ కృత్వా షష్టిః పుత్త్ర సహస్రాణి వసుధాతలం భిభిదు |

తా|| వారందరూ దానిని స్పృశించి ప్రదక్షిణము కూడా చేసి భూమిని మరల త్రవ్వసాగిరి.

తతః ప్రాగుత్తరాం గత్వా సాగరాః ప్రథితాం దిశమ్ |
రోషాదభ్యఖనన్ సర్వే పృథివీం సగరాత్మజాః ||

స|| తతః సర్వే సగరాత్మజాః రోషాత్ ప్రధితాం ప్రాగుత్తరాం దిశమ్ గత్వా అభ్యఖనన్ |

తా|| పిమ్మట ఆ సగరుని కుమారులు అందరూ రోషముతో ప్రశిద్ధమైన ఈశాన్య దిశలో వెళ్ళి భూమిని త్రవ్విరి.

తేతు సర్వే మహాత్మానో భీమవేగా మహాబలాః |
దదృశుః కపిలం తత్ర వాసుదేవం సనాతనమ్ ||

స|| తే సర్వే మాహాత్మనః భీమవేగాః మహబలాః తత్ర సనాతనమ్ వాసుదేవం కపిలమ్ దదృశుః |

తా|| అచట మహాబలవంతులూ , అధిక వేగము కలవారు మహాత్ములూ అగు వారందరూ వాసుదేవునియొక్క అవతారమగు కపిల మహర్షిని గాంచిరి.

హయం చ తస్య దేవస్య చరంతం అవిదూరతః |
ప్రహర్షమతులం ప్రాప్తాః సర్వే తే రఘునందన |

స|| హే! రఘునందన ! తస్య దేవస్య అవిదూరతః చరంతమ్ హయం ( దృష్ట్వా) అతులం ప్రహర్షం ప్రాప్తాః |

తా|| ఓ రఘునందనా ! ఆ దేవునికి దగ్గరలో నడుచుచున్న అశ్వమును చూచి మిక్కిలి సంతోషము పొందిరి.

తే తం హయహరం జ్ఞాత్వా క్రోధపర్యాకులేక్షణాః ||
ఖనిత్ర లాంగలధరా నానావృక్షశిలాధరాః |
అభ్యధావంత సంక్రుద్ధాః తిష్ఠ తిష్ఠేతి చాబ్రువన్ ||

స|| తే తం హయహరం జ్ఞాత్వా క్రోథ పర్యాకులేక్షణః సంక్రుద్ధాః నానావృక్షశిలాధరాః ఖనిత్ర లాంగలధరాః తిష్ఠ తిష్ఠ ఇతి ఆబ్రువన్ అభ్యధావంత |

తా|| వారు ఆయనను అశ్వము అపహరించినవానిగా అనుకొని క్రోధముతో అనేక వృక్షములు, శిలలు , నాగళ్ళను పట్టుకొని, "ఆగుము ఆగుము" అని పలుకుచూ వానివేపు పరుగిడిరి.

అస్మాకం త్వం హి తురగం యజ్ఞీయం హృతవానపి |
దుర్మేధస్త్వం హి సంప్రాప్తాన్ విద్ధి న స్సగరాత్మజాన్ ||

స|| (హే) దుర్మేధః ! అస్మాకం యజ్ఞీయం తురగం త్వం హి హృతవానపి సంప్రాప్తవాన్ ! నః సగరాత్మజాన్ విద్ధి !

తా|| ఓ దుర్మార్గుడా ! మా యజ్ఞసంబంధమైన ఆ అశ్వమును నీవే అపహరించి తీసుకువచ్చితివి. మేము సగరపుత్రులమని తెలిసికొనుము,

శ్రుత్వా తు వచనం తేషాం కపిలో రఘునందన |
రోషేణ మహతాss విష్టో హుంకారమకరోత్ తదా ||

స|| (హే) రఘునందన ! తేషాం వచనమ్ శ్రుత్వా తదా కపిలః రోషేణ మహతా హూంకారం అకరోత్ |

తా|| ఓ రఘునందనా ! వారి మాటలను విని అప్పుడు ఆ కపిల మహర్షి కోపముతో "హుంకారము" చేసెను.

తతస్తేనాప్రమేయేణ కపిలేన మహాత్మనా |
భస్మరాశీకృతా స్సర్వే కాకుత్ స్థ సగరాత్మజాః ||

స|| హే కకుత్స్థా ! తతః స మహాత్మనా కపిలేన అప్రమేయేణ సర్వే సగరాత్మజాః భస్మరాశీకృతా: |

కా|| ఓ కకుత్స్థా ! అప్పుడు ఆ మహాత్ముడగు కపిల ముని చేత సగరకుమారులందరూ భస్మముచేయబడిరి.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చతుర్వింశస్సర్గః ||
సమాప్తం ||

|| ఈ విధముగా ఆదికావ్యమైన వాల్మికిచే రచింపబడిన రామాయణములో బాలకాండలో నలభైయవ సర్గ సమాప్తము ||

||ఓమ్ తత్ సత్ ||


|| Om tat sat ||